Browse By

తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది: అమిత్‌ షా

ఇదేమీ మామూలుగా చెప్పడం లేదు.. వివరాలతోనే వచ్చా… గత పాలకులు ఇచ్చిన నిధులను బీజేపీ ప్రభుత్వం అనేక రెట్లు పెంచింది: అమిత్‌ షా
► ఆ నిధులు పొందడం తెలంగాణ ప్రజల అధికారం

► బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర సత్వర ప్రగతి

► ‘హైదరాబాద్‌’ పోలింగ్‌ బూత్‌ కమిటీ భేటీలో కమల దళపతి


‘‘ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి అందిన చేయూత, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఈ మూడేళ్లలో కేంద్రం అందించిన సాయం ఏంటో తెలంగాణ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది. ఇది నేనేమీ మామూలుగా చెప్తున్న మాటలు కాదు. నా పర్యటనలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందే ఊహించి మొత్తం వివరాలతోనే వచ్చాను. ఇదేదో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఉదారత చూపి ఇస్తుంది కాదు.. ఆ నిధులు పొందే అధికారం తెలంగాణ ప్రజలకు ఉంది. వారి హక్కును కేంద్రం గౌరవిస్తోంది..’’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉండగా 13వ ఆర్థిక సంఘం కింద కేంద్ర పన్నుల వాటా రూపంలో తెలంగాణకు రూ.9,795 కోట్లు అందగా.. దాన్ని పది రెట్లు పెంచుతూ 14వ ఆర్థిక సంఘం కింద మోదీ ప్రభుత్వం రూ.96,706 కోట్లు అందజేసిందన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.2,110 కోట్లు ఇవ్వగా మోదీ ప్రభుత్వం 4.5 రెట్లు పెంచి రూ.9,900 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల గ్రాంట్‌ రూపంలో రూ.249 కోట్లు గతంలో అందగా.. మోదీ ప్రభుత్వం దాన్ని 33 రెట్లు పెంచి రూ.8,764 కోట్లు ఇచ్చిందన్నారు. వీటిని కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే కేటాయించిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ చేయూత కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలాంటి సంస్థల కేటాయింపును మరిచిపోవద్దని సూచించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail