Browse By

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో: ఉత్త‌మ్ 

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో 
సూర్యాపేట స‌భ‌లో ఉత్త‌మ్ 

వ్య‌వ‌సాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం 
బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మూడు రోజుల న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ప్లాఫ్ షో అని, పూర్తిగా విఫ‌ల‌మైన ప‌ర్య‌ట‌న అని, ఎంతో పెద్ద ఆర్భాటాలు చేసి హంగామాలు చేసిన బిజెపి, చివ‌ర‌కు విఫ‌ల‌మైన షోగా ముగించుకున్నార‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధ‌వారం నాడు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన‌పుడు ఇక్కడ సామాన్య ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌పై ఎలాంటి బాధ్య‌తతో ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని విమ‌ర్శించారు. తెలంగాణలో ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఇబ్బందుల‌పై కేంద్రం స‌రైన విధంగా స్పందించ‌లేద‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని, కేంద్రం విభ‌జ‌న స‌మ‌యంలో బిల్లులో పెట్టిన ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌ని కేంద్రం తెలంగాణ‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

విభ‌జ‌న స‌మ‌యంలో కాజీపేట‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని కానీ, బ‌య్యారంలో ఇనుమ ప‌రిశ్ర‌మ‌ను కానీ, ట్రైబ‌ల్ యూనివ‌ర్శిటీని కానీ మంజూరు చేయ‌లేద‌ని, ఇక‌పోతే గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో మంజూరు అయిన ఐ.టి.ఐ.ఆర్ ను కూడా అమ‌లు చేయ‌లేక‌పోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ మూడేళ్ళ కాలంలో క‌నీసం విభ‌జ‌న హామీలో హైకోర్టు విభ‌జ‌న కూడా చేయ‌లేక పోయార‌ని ఆయ‌న అన్నారు. ఇక‌పోతే ప్ర‌తి రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల‌లో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సి ఉంద‌ని కానీ ఒక్క ప్రాజెక్టు కూడా రాలేద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇక‌పోతే ఎన్నిక‌ల స‌మ‌యంలో బిజెపి దేశ‌వ్యాప్తంగా అనేక హామీలు ఇచ్చింద‌ని, ప్ర‌ధానంగా స్విస్ బ్యాంకుల్లో, విదేశీ బ్యాంకుల‌లో ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని తెప్పించి ప్ర‌తి పౌరుని ఖాతాలో రూ.15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేస్తామ‌ని చెప్పి ఒక్కపైసా జ‌మ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో ఉంద‌ని, రైతాంగం అనేక క‌ష్ట న‌ష్టాల‌లో ఉన్న కూడా రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు చేపట్ట‌లేద‌ని, కేంద్ర‌, రాష్ట్రం రైతాంగాన్ని ఆదుకునే విష‌యంలో పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశాయ‌ని ఫ‌లితంగా దేశంలోనే అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శంచారు. 
అమిత్ షా తెలంగాణ‌ను మ‌రో ఉత్తర్ ప్ర‌దేశ్ చేయాల‌ని రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో వ‌చ్చార‌ని కానీ తెలంగాణ ప్ర‌జ‌లు చాల వివేక‌వంతుల‌ని అమిత్ షా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు తిప్పి కొడుతార‌ని ఆయ‌న అన్నారు తెలంగాణ మ‌రో పంజాబ్‌, డిల్లీ, బీహార్ లాగా బిజెపికి బుద్ది చెప్పి రాబోయే 2019 ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీకి ఇక్క‌డ అధికారం చేప‌డుతార‌ని, అమిత్ షా కాదు ఏ నాయ‌కుడు వ‌చ్చినా కూడా కాంగ్రెస్ విజయాన్ని ఆప‌లేర‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 
ఒక‌వైపు ముఖ్య‌మంత్రి కేసిఆర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని పొడుగుతూ స‌న్నిహిత సంబంధాలు మెరుగుప‌రుచుకుంటున్నార‌ని మ‌రోవైపు జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా కేసిఆర్‌ను, టిఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై నిశిత విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఇదంతా చూస్తుంటే టిఆర్ ఎస్‌, బిజెపిలు రెండు రాష్ట్రంలో రాజ‌కీయ దోబూచులాట‌లు ఆడుతున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ల‌క్ష కోట్ల రూపాయ‌లు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామ‌ని అనేక అద‌నపు నిధులు ఇచ్చామ‌ని అమిత్ షా చెబుతున్నార‌ని, ఇదంతా నిజ‌మైతే ఆ నిధులు ఎటు పోయాయ‌ని, కేసిఆర్ ఈ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో జ‌ర‌గ‌బోయే తెలంగాణ ప్ర‌జా గ‌ర్జ‌న స‌భ‌ను పెద్ద ఎత్తున విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ప్ర‌తి ప‌ల్లె నుంచి ప‌ది మంది త‌ప్ప‌కుండా స‌భ‌కు హాజ‌రు కావాల‌ని, అక్క‌డ రాహుల్ గాంధీ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ ఎస్ పాల‌న‌పై చార్జీషీట్ విడుద‌ల చేస్తార‌ని, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాల‌తో ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రితో విసిగిపోయిన ప్ర‌జ‌లు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఉత్సాహ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. రాహుల్ గాంధీని స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తి కార్య‌కర్త కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
ఈ స‌భ‌లో ఆయ‌న వెంట ఎఐసిసి కార్య‌ద‌ర్శి రాంచంద్ర కుంతియా, మాజీ మంత్రి ఆర్‌.దామోద‌ర్ రెడ్డి, డిసిసి అధ్య‌క్షులు బిక్ష‌మ‌య్య గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

త‌ల‌సానిని మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాలి ః మ‌ల్లు ర‌వి..
ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మ‌తి తప్పి మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న మాట‌లు మంత్రి స్థాయిలో లేవ‌ని, రాజ్యంగ బ‌ద్దంగా ప‌నిచేయాల్సిన వ్య‌క్తి బజారు రౌడీలాగ మాట్లాడుతున్నార‌ని టిపిసిసి ఉపాధ్య‌క్షులు మ‌ల్లు ర‌వి అన్నారు. బుధ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ స్థాయి దిగ‌జారిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్న త‌ల‌సానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌ల‌సాని త‌ల‌పొగ‌రుతో మాట్లాడితే కాంగ్రెస్ నాయ‌కుల‌పైన‌, కాంగ్రెస్ పార్టీపైన అవాకులు, చెవాకులు మాట్లాడితే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కూడా త‌ల‌సానికి త‌గిన బుద్ది చెబుతార‌ని ఆయ‌న అన్నారు. 
గ‌తంలో త‌ల‌సాని టిడిపిలో ఉన్న స‌మ‌యంలో టిఆర్ ఎస్ నాయ‌కుల‌పైనా, కేసిఆర్‌పైన కూడా ఇలాగే నోరు పారేసుకున్నార‌ని ఇప్ప‌డు టిఆర్ ఎస్‌లో చేరి కాంగ్రెస్‌ను, టిడిపిపైన నోరు పారేసుకుంటున్నార‌ని, రాజ‌కీయ రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి లాంటి త‌ల‌సానిపైన ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. త‌ల‌సాని ప‌ద్ద‌తి మార్చుకొని గౌర‌వ‌ప్ర‌ద‌మైన రాజ‌కీయాలు చేయ‌క‌పోతే త‌రిమికొట్టే రోజులు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. 
రాహుల్ స‌భ‌కు 20 వేల మంది కార్మికులు ః జ‌న‌క్ ప్ర‌సాద్‌..
 జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో జ‌ర‌గ‌నున్న రాహుల్ గాంధీ బ‌హిరంగ స‌భ‌కు తెలంగాణ వ్యాప్తంగా 20 వేల మంది కార్మికులు పాల్గొంటార‌ని సంఘ‌టిత, అసంఘిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేస్తార‌ని టిపిసిసి అధికార ప్ర‌తినిధి, ఐఎన్ టియుసి ఉపాధ్య‌క్షులు జ‌న‌క్ ప్ర‌సాద్ అన్నారు. బుధ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్ల‌డుతూ హైద‌రాబాద్‌లో ఉన్న 250 ప‌రిశ్ర‌మ‌ల నుంచి కార్మికులు విచ్చేస్తార‌ని అలాగే జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం కూలీల‌ను, ఇత‌ర అసంఘిత కార్మికులు క‌లిసి దాదాపు 20 వేల మంది ఈ స‌భ‌కు త‌ర‌లివెళ‌తార‌ని ఆయ‌న అన్నారు. ఈ స‌భను విజ‌య‌వంతం చేసేందుకు ఐఎన్‌టియుసి అధ్య‌క్షులు సంజీవ‌రెడ్డి ఆదేశాల మేర‌కు ప్ర‌తి 10 ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒక ఇంచార్జ్‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail