Browse By

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం: కేసీఆర్‌

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం ఓరుగ‌ల్లు ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో సీఎం కేసీఆర్‌ 


తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూ తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజా సేవకే పునరంకితమవుతానని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ 16వ‌ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో తాము సాధించిన ప్రగతి గురించి చర్చిస్తూనే భవిష్యత్‌ కార్యచరణను ఆవిష్కరించారు. ఆచార్య జయశంకర్‌ను స్మరిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే…


* ఓరుగల్లు పోరుగల్లు. ఇదే మైదానంలో అనేకసార్లు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నాం. గతంలో జరిగిన అన్ని సభల్లో ఆచార్య జయశంకర్‌ సార్‌ ముందు మాట్లాడి.. ఆ తర్వాత నేను మాట్లాడేవాణ్ని. ఆయన ఇక్కడలేరు. ఎంతో బాధాకరం. ఆయన స్వర్గం నుంచి చూస్తున్నారు. జయశంకర్‌సార్‌ అమర్‌ రహే.
* పార్టీ 16 వసంతాలు ముగించుకుంది. ఉంటదా అని ఒకరు. వూడుద్ది అని ఇంకొకరు. ఇలా నానా రకాలుగా మాట్లాడారు. పార్టీని ముందుండి నడపడమే కాదు.. దిగ్విజయంగా మూడేళ్లు పరిపాలనను కూడా పూర్తిచేసుకున్నాం. రాష్ట్రం సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడాం. అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్న నేపథ్యంలో ఈ మహాసభ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.


* పార్టీ స్థాపించిన‌ప్ప‌టినుంచి.. తెలంగాణ ఉద్యమ సాధన.. ప్రభుత్వ ఏర్పాటు.. ఇలా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో కార్యకర్తలు అండగా నిలిచారు. నేడు ప్రభుత్వం సాధిస్తున్న కీర్తి మాత్రం గులాబీ శ్రేణులదే.
* ఎవరినీ విస్మరించకుండా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. తెలంగాణ వచ్చిన కొత్తల్లో ఎక్కడ చూసినా ప్రజల అవస్థలు. పాలమూరు ప్రజల వలసలు.. చేనేత కార్మికుల ఆకలి చావులే. ఆ పరిస్థితిని మార్చే దిశగా చర్యలు ప్రారంభించి వారి సంక్షేమానికి పాటుపడుతున్నాం. సంక్షేమానికి పెద్ద‌పీట వేశాం. రూ.40వేల కోట్ల‌తో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లుప‌రుస్తున్నాం. పేద‌లు,వితంతువులు, వృద్ధుల‌ను ఆదుకోవాల‌నే ఆస‌రా పింఛ‌న్లు. రాష్ట్రంలో మంచినీటి కొర‌త తీర్చేందుకే మిష‌న్ భ‌గీర‌థ చేప‌ట్టాం. రూ.43వేల కోట్లతో అది నిర్విరామంగా సాగుతోంది.


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి 

దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా పాలనా సంస్కరణలు చేపట్టాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. గత 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పనిచేయలేదు. 84లక్షల గొర్రెలను రెండేళ్లలో పంపిణీ చేయనున్నాం.

* నాయీ బ్రాహ్మణు, రజకులు, కమ్మరి, చేనేత, విశ్వబ్రాహ్మణులు.. ఇలా బీసీ వర్గాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ధనిక రాష్ట్రం మనది గనక రాష్ట్రంలో సంస్కృతి మారాలి. రూ.లక్ష చొప్పున ఆధునిక సెలూన్లు ఇస్తాం. రజకులకు ధోబీ ఘాట్లు, వాషింగ్‌ మిషన్లు ఇస్తాం. విశ్వబ్రాహ్మణ, కమ్మరి, కంచరలకు రూ.200 కోట్ల బడ్జెట్‌ కేటాయించాం.

* ఎరువుల కొరత, విత్తనాల కొరత చూస్తున్నాం. లైన్లలో ఉన్నా బస్తా విత్తనాలు రైతన్నకు దొరకని పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువులు, విత్తనాల కొరత రానీయం. తెరాస ప్రభుత్వం వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములే ఉన్నాయి. 20 లక్షల మెట్రిక్‌ టన్నులకు వాటిని విస్తరిస్తున్నాం. విద్యుత్‌ సమస్యను అధిగమించాం. మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. మత్స్యశాఖకు రూ.వెయ్యికోట్లు కేటాయించాం.

* గ్రామీణ రైతులు బాగుపడాలి. దేశంలో రూ.17వేల కోట్లతో విజయవంతంగా రుణాలను మాఫీ చేశాం. సీఎంగా తొలి అసెంబ్లీ సమావేశంలోనే ప్రసంగంలోనే రైతాంగాన్ని ధనికంగా మారుస్తానన్నాను. క్రాప్‌ కాలనీగా మారుస్తానని చెప్పాను. పట్టుపట్టాలి.. జట్టు కట్టాలి..

చెత్త కుండీల్లో ప్లాస్టిక్‌ ఏరుకునేవారికి సంఘాలు ఉన్నాయి. ఆరుగాలం శ్రమించినా మనం పండించే పంటకు మనం ధర నిర్ణయించే పరిస్థితి లేదు. మీ వెంట కేసీఆర్‌ ఉంటాడు. మన పంటకు మనమే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి. పట్టుపట్టాలి. జట్టు కట్టాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన జాతి మనది. మనమంతా అనుకుంటే.. రంధిలేని వ్యవసాయం చేసే రోజు వస్తది.

* ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు పంటల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించాం. మే 15లోగా ఆ మొత్తాన్ని ఖాతాల్లో జమచేస్తాం.దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 15లోపు మరో రూ.4వేలు జమచేస్తాం. విద్యుత్తు ఉచితం. నీరుకు బాధలేదు.

* గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతుల సమాఖ్యలు ఏర్పాటు కావాలి. ధాన్యం పండగానే మార్కెట్‌కు పోవద్దు. గ్రామ రైతు సంఘాలు, మండల, జిల్లా రైతు సంఘాలు వ్యాపారులతో మాట్లాడతారు. మనం వ్యాపారులతో ధైర్యంగా మాట్లాడి మన సరకును అమ్ముకొనే పరిస్థితికి రావాలి. అప్పుడే కనీస మద్దతు ధర రాబట్టుకోగల్గుతాం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం.

* పదిన్నర నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేశాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడి కాంగ్రెస్‌ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది. ప్రాజెక్టుల్ని అడ్డుకొనేందుకు స్టేలు తెస్తున్నారు. కాంగ్రెస్‌ వల్లే ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. వారిని ఎక్కడికక్కడ నిలదీయాలి.

* కాంగ్రెస్‌ నాయకుల నిష్క్రియాపరత్వం వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నప్పుడు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్‌ నేతలంతా ముసిముసినవ్వులు నవ్వారు.

* పిడికెడు మందితో ప్రారంభమై తెరాస 70లక్షల సభ్యత్వంతో దేశంలోనే ఓ మంచి రాజకీయ శక్తిగా ఎదిగింది. 2019లో బ్రహ్మాండమైన విజయం సాధించి మనం కోరుకున్న బంగారు తెలంగాణను సాధించుకుందాం. తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాటానికి నా చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు ప్రజా సేవకు పునరంకితమవుతా. 

100 శాతం హామీల అమలు: కడియం 

తెరాస మేనిఫెస్టో హామీలను వందకు వందశాతం అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్‌ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. స‌భ‌లో ఆయ‌న స్వాగ‌తోప‌న్యాసం చేశారు. బడ్జెట్‌లో రూ.40వేల కోట్లుసంక్షేమ రంగానికే కేటాయించి ఆదర్శంగా నిలిచామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం ప్రవేశపెట్టామని, గర్భిణులకు రూ.12వేల ఆర్థిక సాయం చేస్తున్నామని అన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని కేసీఆర్‌ కిట్‌ పేరుతో రూ.2వేలు సరకులను అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీలను నమ్మడంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.20లక్షల మేర సాయం చేస్తున్నట్టు చెప్పారు. అయినా విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనన్నారు.

జనసంద్రం చూస్తుంటే సంతోషంగా ఉంది: కేకే 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షత వహించిన ఈ సభలో తెరాస సెక్రటరీ జనరల్‌, ఎంపీ కేశవరావు తొలిపలుకులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఆకాశాన్ని పగలగొట్టయినా తెలంగాణ తెస్తాననని చెప్పిన మాటను సాకారం చేసిన నేత కేసీఆర్‌ అని కొనియాడారు. ఈ రోజు ఇక్కడకి వచ్చిన ప్రజాసంద్రాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణణు బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రజామద్దతుతో అధికారంలోకి వచ్చిన సమయంలో అంతా చీకటిమయంగా ఉండేదని, మూడునెలల కాలంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు. అంతటితోనే ఆగకుండా రైతులకు భూగర్భ జలవనరుల్ని అందించేందుకు కాకతీయ మిషన్‌ తీసుకొచ్చామని చెప్పారు. కళకళలాడుతున్న చెరువుల్ని చూస్తుంటే ఎంతో ఆనందమేస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని రైతు రాజ్యంగా మార్చే దిశగా దేశంలోనే తొలిసారిగా ఎకరానికి రూ. 8వేలు ఇస్తున్నట్టు చెప్పారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail