Browse By

తెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు: ఈటల

ఏపీ ప్రజలూ ఓ కేసీఆర్ ను కోరుకుంటున్నారుతెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు

బాబూ నీకు దమ్ము, సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీపడు

మంత్రి ఈటల రాజేందర్

 

స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన చిన్నరాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయి. గుజరాత్, చత్తీస్ ఘడ్, హర్యాణ, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఈ సత్యాన్ని చూడలేని అంధుడు చంద్రబాబు. వాస్తవాలను గ్రహించకుండా, తెలంగాణ ఏర్పాటు చీకటిరోజు అని మాట్లాడడం అత్యంత బాధాకరం. చంద్రబాబు మాటతీరు అవగాహన లేనిది, అత్యంత హీనమైనది. రెండు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు మాటతీరును, కార్చిన మొసలి కన్నీరును చూసి అసహ్యించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బాబు మాట్లాడడం అభ్యంతరకరం. రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసుందాం, అభివృద్ధిలో ముందుందాం అని కేసీఆర్ ఆనాడు చెప్పారు. ఈనాడు సుసాధ్యం చెేశారు. కానీ కేసీఆర్ తో పోటీ పడలేక, పరిపాలన రాక, సత్తా లేక, దమ్ము లేక ఏపీ ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ… మేము మాత్రం సుస్థిర, మానవీయ, ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ప్రజల విశ్వాసం పొందాం. ఆంధ్రప్రదేశ్ లో ఆ విశ్వాసం పొందలేక మొసలికన్నీరు కారుస్తూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇది అనుభవం, జ్ఞానం ఉన్న నాయకుడు చేసే పని కాదు. 
 

విడిపోయిన రెండు సంవత్సరాల్లోనే రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ ను రెండు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకున్నామంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామనే కదా అర్థం. ఈ వాస్తవాన్ని మరచిపోయి మాట్లాడడం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకూ ఓ కేసీఆర్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారు. ఇప్పటికైనా పోటీ పడాల్సింది అభివృద్ధిలో కాని, కుట్రలు, కుతంత్రాల్లో కాదు. ఈ గడ్డ మీదున్న మీ వందిమాగధులు అవాక్కులు, చెవాక్కులు పేలుతూ, రెచ్చగొడుతూ ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. వారికి తగిన గుణపాఠం తప్పదు. 
 

పార్లమెంటులో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాయి. మీ వెకిలి చేష్టలకు ప్రలోభాలకు లొంగలేదు. పద్నాలుగు సంవత్సరాల పాటు అన్ని పార్టీలను కలిసిన కేసీఆర్ తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు. ఆర్ఎస్ యూ నుంచి ఆరెస్సెస్ వరకూ అందరినీ ఒప్పించాం. మాకు బేషజాలు, పంతాలు, రాజకీయాలు లేవు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చంద్రబాబు మాటల్ని గమనించండి. చౌకబారు మాటలు బంద్ పెట్టి అభివృద్ధిలో ముందుకు నడవమని అడగండి. ప్రజల మధ్య ప్రేమ, మానవ సంబంధాలు ఉండాలి కాని ద్వేషాలు కాదు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail