Browse By

చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం:  సియం కేసిఆర్

నేతన్నల బాధలు పోగొట్టాల్సిందే.. తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత
నేడు సిరిసిల్ల కార్మికులతో సీఎం భేటీ.. 

నేత కార్మికుల సంక్షేమంపై సమీక్ష
హైదరాబాద్: చేనేత మగ్గాలు, విద్యుత్ మగ్గాల (హ్యాండ్లూం, పవర్‌లూం) మీద ఆధారపడి బతుకుతున్న నేత కార్మికుల స్థితిగతులేమీ బాగాలేవని, బతుకడం కూడా కష్టమై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. వీరి బాధలు తొలగించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ఇందుకోసం ఏం చేయాలనే విషయంపై అధికారులతో చర్చించిన సీఎం.. చేనేత, పవర్‌లూం కార్మికులను ఆదుకునే విషయంలో స్పష్టతకు వచ్చారు. నేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగించి, వారి సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని సీఎం నిర్ణయించారు. హ్యాండ్లూం, పవర్‌లూం కార్మికుల స్థితిగతులు, వారి సంక్షేమంకోసం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆదివారం సిరిసిల్లకు చెందిన నేత కార్మికులతో మరోసారి సమావేశమై, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 

ఇందుకోసం నేత కార్మికులను హైదరాబాద్‌కు ఆయన ఆహ్వానించారు. నేత వృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తప్పక చొరవ చూపాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి భావించారు. రాష్ట్రంలో చేనేత మగ్గాలు, విద్యుత్ మగ్గాల మీద పని చేస్తున్న వారి కోసం ఏం చేయాలి? వారి ఆర్థిక స్థితి మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నేత పరిశ్రమ లాభసాటిగా మారడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలి? అనే విషయాల్లో కూడా ముఖ్యమంత్రి స్పష్టతకు వచ్చారు. ఆదివారం నాటి సమావేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని వారి ద్వారానే తెలుసుకోవడానికి సీఎం నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కే తారక రామారావు, టీ హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హ్యాండ్లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్‌రావు, చేనేత సంఘాల నాయకుడు జెల్ల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail