Browse By

నాగబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డ వర్మ

ఖైదీ నంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ, సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ లను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ పై వారు స్పందించారు.నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని, తన ట్వీట్ల వల్ల బాధపడితే చిరంజీవి కుటుంబానికి సారీ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. కాసేపటికే మాట మార్చాడు. తానెప్పుడూ తెలుగులో ట్వీట్ చేయలేదని, తన ట్విట్టర్ ఎకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నాగబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. మీరు ట్విట్టర్ లో లేరు కాబట్టి ఎవరైనా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

మీ అన్నకు ఉన్న గొప్పదనంలో 0.1 శాతం కూడా నీకు లేదని పేర్కొన్నాడు. గ్రేట్ అన్నయ్యకు ప్రజారాజ్యం పార్టీ కోసం ఎలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావో, ఆయన వైఫల్యానికి ఎలా కారణమయ్యావో రాష్ట్రమంతటికీ తెలుసని వ్యాఖ్యానించాడు. నాకు సలహాలు ఇచ్చే ముందు నీ జబర్దస్త్ జీవితం గురించి ఒకసారి తెలుసుకోవాలని ఎద్దేవా చేశాడు. నాగబాబు సార్ కు ఇంగ్లిష్ అర్థం కాదు.. నా ట్వీట్లను ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్ తో తెలుగులోకి అనువాదం చేయించుకో అని సూచించాడు. తన కెరీర్ వల్ల చాలా కుటుంబాలు బతికాయని, నాగబాబు సోదరుల వల్లనే ఆయన బతుకుతున్నాడని వ్యాఖ్యానించాడు. కావాలంటే ఈ విషయంలో ఇంకా వివరంగా చెబుతానన్నాడు. నాలాంటి అక్కుపక్షుల మీద కేంద్రీకరించే కంటే మీ సోదరులను సంతోషపెట్టడంపై దృష్టి పెట్టండి, లేకుంటే మీరు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించాడు.

మరోవైపు, యండమూరి కూడా నాగబాబు వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఆరేడేళ్ల కిందట ఓ కాలేజీలో మాట్లాడిన విషయంపై ఇప్పుడు ఎందుకు తిట్టాడో అర్థం కావడం లేదన్నారు. రామ్ చరణ్ ను, దేవిశ్రీ ప్రసాద్ ను పోలుస్తూ.. మన తండ్రి ఎవరన్నది ముఖ్యం కాదని, మనలో ఉన్న శక్తి మనల్ని గొప్పవాళ్లను చేస్తుందని చెప్పానని గుర్తుచేశారు. రాంచరణ్, దేవిశ్రీ ప్రసాద్ తండ్రులిద్దరూ తనకు మంచి మిత్రులన్నారు. తాను మాట్లాడిన మాటల్లో తప్పేం లేదని యండమూరి స్పష్టం చేశారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail