Browse By

మాదిగల రిజర్వేషన్లకు టిఆర్ఎస్ కట్టుబడి ఉంది- డిప్యూటీ సిఎం కడియం

త్వరలోనే జీవో 183ని పునరుద్ధరించే ప్రయత్న- డిప్యూటీ సిఎం కడియం• డప్పు-చెప్పుకు సిఎం కేసిఆర్ 200 పెన్షన్ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది- కడియం

• వర్గీకరణ న్యాయమైన డిమాండ్ తప్పక నేరవేరుతుంది- మంత్రి ఈటెల

• మాదిగలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది-మంత్రి జగదీశ్ రెడ్డి

 

హైదరాబాద్ 28- మాదిగల రిజర్వేషన్లకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మలిదశ పోరాటంలో సాధించి తీరుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కేంద్రంలో అధికార పార్టీ బిజేపీలు మాదిగల వర్గీకరణపై రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మొదటి నుంచి మాదిగల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని, అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 2014 సంవత్సరంలోనే ఏకగ్రీవ తీర్మాణం చేశారన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసిఆర్ తో పాటు తాను కూడా వెళ్లి ప్రధాని మోడీతో పదిహేను నిమిషాలు వర్గీకరణ కచ్చితంగా చేయాలని వివరించామన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలలో సమస్యలుంటే కనీసం తెలంగాణకు అనుమతి ఇవ్వమని కోరామని, ప్రస్తుతం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లికి తీసుకెళ్లాలని నిన్న కూడా సిఎం కేసిఆర్ హామీ ఇచ్చిన అంశాన్ని స్పష్టం చేశారు.

మాదిగల రిజర్వేషన్లు, డప్పు-చెప్పుకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి, మాదిగల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పథకాల్లో రిజర్వేషన్లు కల్పించే జీవో 183ని పునరుద్ధరించాలనే డిమాండ్లతో ఇందిరా పార్కు వద్ద తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యుత్, ఎస్సీ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, ఎమ్మార్పీఎస్ నేతలు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్, పాపయ్యలతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.

మాదిగల రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ కాలం నుంచి మద్దతు ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే విధంగా మాదిగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అయితే మిగిలిన రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను, మాదిగలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు వర్గీకరణ కోసం పాటు పడలేదని ప్రశ్నించారు. మాదిగల కోసం మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎందుకు తీర్మాణం చేయలేదన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రిజర్వేషన్లు తీసుకొస్తామన్న బిజెపి రెండున్నరేళ్లు అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. మాదిగల రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్న టిఆర్ఎస్ ను విమర్శిస్తున్న మందకృష్ణ మాదిగకు ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అభినవ అంబేద్కర్ గా అభివర్ణించి, పాదాభివందనం చేసిన వెంకయ్యనాయుడు ఎందుకు రిజర్వేషన్ల కోసం పనిచేయడం లేదన్నారు. నిజంగా వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడులు అనుకుంటే రిజర్వేషన్లు జరగవా? అని సభను ఉద్దేశించి ప్రశ్నించారు. వీరంతా మాదిగలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, టిఆర్ఎస్ మాత్రం చిత్తశుద్ధితో మాదిగల రిజర్వేషన్ల కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తోందన్నారు. త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్న తీసుకెళ్లి వర్గీకరణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని, ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

ఇక డప్పు-చెప్పుకు రెండువేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ పరిశీలనలో ఉందని, త్వరలోనే ఈ డిమాండ్ సిఎం కేసిఆర్ నెరవేరుస్తారన్న నమ్మకం తనకుందన్నారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మాదిగలకు ప్రభుత్వ పథకాలలో రిజర్వేషన్లు కల్పించాలన్న జీవో 183ని కూడా త్వరలోనే పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు.

మాదిగల రిజర్వేషన్ల పోరాటంలో న్యాయం ఉందని, ఇది కచ్చితంగా నెరవేరుతుందని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ ప్రభుత్వం మాదిగల డిమాండ్లను తీర్చాలన్న తపన ఉన్న ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణ కోసం సాయుధ పోరాటంలో తాతలు, 1969 ఉద్యమంలో తండ్రులు, కేసిఆర్ నాయకత్వంలో కొడుకులు కొట్లాడితే రాష్ట్రం సాధ్యమైందని, అదేవిధంగా మాదిగల రిజర్వేషన్ కూడా కొంత ఆలస్యమైనా తప్పక సిద్ధిస్తుందన్న హామీ ఇచ్చారు. ఆశయాన్ని వదలకొండా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఆలోపు మాదిగలకు రుణాల విషయంలో లక్ష నుంచి దానిని పదిలక్షల రూపాయలకు పెంచామన్నారు. అదేవిధంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి నేతృత్వంలో విద్యలో అన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

మాదిగల రిజర్వేషన్లపై టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయముందని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా మొదటి సారి అయినప్పుడే తన నియోజక వర్గంలో దళిత జ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసిన మొదటి నాయకుడుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వాళ్లకు తెలంగాణలో 85శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పిన నేత ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. రిజర్వేషన్లు వచ్చేంత వరకు వేచి ఉండవద్దని, ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన విద్య అవకాశాలు అందించేందుకు కార్పోరేట్ విద్యాలయాలకు పోటీ పడే విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 35వేల కోట్లకు పైగా సంక్షేమ కోసం ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనని స్పష్టం చేశారు. డప్పు-చెప్పుకు న్యాయం జరుగుతుందని, వర్గీకరణకు ప్రభుత్వం నుంచి పూర్తి అండ ఉంటుందని హామీ ఇచ్చారు.

సమావేశంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్యలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు.

 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail