Browse By

ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాప్రతినిధులందరూ చేనేత వస్ర్తాలు ధరించాల్సిందిగా మంత్రి లేఖలో కోరారు. చేనేత కార్మికులకు మనవంతుగా మంచి చేద్దామని తెలిపిన మంత్రి బంగారు తెలంగాణలో చేనేత కార్మికులను భాగం చేసుకుందామని అన్నారు.


చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజాప్రతినిధులకు చేనేత శాఖ మంత్రి కెటియార్ లేఖ :
గౌరవనీయులైన

శ్రీ /శ్రీమతి _____________________ గారికి

__________ నియోజకవర్గం

 

ఆరు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసిన కోట్లాది ఆశలు, లెక్కలేనన్ని కోరికలను గమ్యానికి చేర్చడానికి ప్రతీక్షణం తపిస్తున్న మీ అందరికి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వపరిపాలనలో తనను తాను తిరిగి నిర్మించుకుంటున్న తెలంగాణలో తారతమ్యాలు లేని అభివృద్ధినే ప్రభుత్వం కోరుకుంటుంది.
ఆ దిశలోనే మా ఆలోచనలు, మా ఆచరణ ఉన్నాయని చెప్పడానికి నాకెలాంటి అనుమానం లేదు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రభుత్వం కూడా సబ్బండవర్ణాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతోంది.
బట్ట కట్టినంకనే నాగరికత నడక నేర్చిందంటారు. లోకం ఆకలి తీర్చడానికి పొలంలో అన్నదాత హలం పడితే, మానం కాపాడడానికి నేతన్న మగ్గం పట్టాడు. భారతీయ సంప్రదాయ ఔన్నత్యాన్ని, చేనేతలోని హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్న ఎందరో నేతన్నలు తెలంగాణ గడ్డపై ఉన్నారు. పోచంపల్లి వస్త్రాల ప్రాభవం, నారాయణ పేట వస్త్రాల నాజూకుతనం, గద్వాల వస్త్రాల ఘనతను దేశవిదేశాలు కీర్తిస్తున్నాయి.
సడుగులిరిగిన నేతన్న మగ్గానికి పూర్వ వైభవం తేవడానికి తెలంగాణ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తోంది. తెలంగాణ వస్తేనే తమ బతుకులు మారుతాయని ఆశగా ఎదురుచూసిన చేనేత కార్మికులకు మనవంతుగా మంచి చేసేందుకు ఈ నూతన సంవత్సరం ఒక అవకాశం కల్పించింది. మగ్గం ఆడితేనే కాని డొక్కాడని చేనేత శ్రామికులకు చేయూతనిచ్చేందుకు వారంలో ఒక రోజు తప్పనిసరిగా మీరంతా చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతున్నాను. మీరే కాదు మీ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది అంతా చేనేత దుస్తులే ధరించేలా చూడాలని ప్రార్థిస్తున్నాను. టెస్కో సంస్థ అమలు చేస్తున్న “చేనేత లక్ష్మి పథకం”లో చేరి చేనేత వస్త్రములను కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించుటకు మీవంతు సహాయం చేయవలసినదిగా కోరుచున్నాను.
ఒకప్పుడు చేనేత పరిశ్రమ ఉండేదని రాబోయే తరాలు చెప్పుకోవద్దంటే ఈ చిన్న ప్రయత్నాన్ని మనమంతా విజయవంతం చేద్దాం. బంగారు తెలంగాణలో చేనేత కార్మికులను కూడా భాగం చేసుకుందాం.

జై తెలంగాణ జై నేతన్న,

మీ

(కె. తారక రామా రావు )

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail