Browse By

నల్లధనం మార్పిడి యత్నాలపై బినామీ ఆస్తుల చట్టం

నల్లధనం మార్పిడి యత్నాలపై బినామీ ఆస్తుల చట్టం 
ఆదాయ పన్ను శాఖ నిర్ణయం 

గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ జైలు 
లెక్కల్లో చూపని పాత కరెన్సీ నోట్లను ఇతరుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని మానుకోవాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. ఇలాంటివారిపై కొత్తగా తెచ్చిన బినామీ లావాదేవీల చట్టం కింద అభియోగాలు నమోదు చేయాలని నిర్ణయించింది. దీనికింద దోషులకు జరిమానా, ప్రాసిక్యూషన్‌, గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ కఠిన కారాగారశిక్ష పడేవీలుంది. రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను అనుమానిత పద్ధతిలో వినియోగిస్తున్న కేసులకు సంబంధించి 80 సర్వేలు, 30 సోదాలు నిర్వహించామని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రూ.200 కోట్ల అప్రకటిత సొమ్మును గుర్తించినట్లు వివరించాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రూ.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం వెలువరించాక పెద్ద మొత్తంలో నగదు జమయిన అనుమానిత బ్యాంకు ఖాతాలను గుర్తించేందుకు భారీ అపరేషన్‌ను ఐటీ అధికారులు చేపట్టారు. అనుమానాలు ధ్రువపడిన కేసుల్లో బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద ప్రాసిక్యూషన్‌ ప్రయోగిస్తామని తెలిపారు. ‘‘ఇప్పటికే కొన్ని కేసులను గుర్తించాం. వీరికి బినామీ చట్టం కింద నోటీసులు చేయబోతున్నాం’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత రూ.2.5లక్షల పరిధిని మించి డిపాజిట్లు చేసిన కేసుల్లో నోటీసులు జారీ చేస్తామని చెప్పాయి. బ్యాంకు లేదా ఆర్థిక నిఘా విభాగం నుంచి అనుమానిత నివేదికలు అందితే రూ.2.5 లక్షల లోపు డిపాజిట్లకూ నోటీసులు పంపుతామని వివరించాయి. బినామీ ఆస్తుల లావాదేవీ చట్టం ఈ నెల నుంచే అమల్లోకి వచ్చింది. ఇది స్థిర, చర ఆస్తులకు వర్తిస్తుంది. 


ఈ చట్టం ప్రకారం.. కొత్త కరెన్సీలోకి మార్చి ఇచ్చే ఒప్పందంపై పాత కరెన్సీని మరొకరి ఖాతాలో జమచేయడాన్ని బినామీ లావాదేవీగా పేర్కొంటారు. సొమ్మును జమ చేసే వ్యక్తిని లబ్ధిదారుడైన యజమానిగా పరిగణిస్తారు. ఈ పాత నోట్లను తన ఖాతాలోకి జమ చేసుకున్న వ్యక్తిని బినామీదారుగా పేర్కొంటారు. లబ్ధిదారుడైన యజమానితోపాటు బినామీదారును కూడా ప్రాసిక్యూట్‌ చేయవచ్చు. వీరిద్దరితోపాటు ఈ లావాదేవీకి ప్రేరేపించిన ఇతర వ్యక్తులకూ ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడేవీలుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఇలా జమైన బినామీ సొమ్మును స్వాధీనం చేసుకుంటామన్నారు. సదరు బినామీ ఆస్తిపై మార్కెట్‌ విలువలో 25 శాతం వరకూ జరిమానాను నిందితుల కట్టాల్సి ఉంటుందని తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail