Browse By

తెలంగాణను రోల్ మోడల్ గా చూపేలా కేసీఆర్ సర్కార్: జూపల్లి

ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్స్ పై రాజేంద్రనగర్ ఎన్ఐఆర్ డి(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్) లో అంతర్జాతీయ శిక్షణ శిభిరాన్ని ప్రారంభించిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
వచ్చె నెల 27 వరకు జరగనున్న శిక్షణ కార్యక్రమం, హాజరైన వివిధ దేశాల ప్రభుత్వ ఉద్యోగులు
హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని, గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్ లోని ఎన్ఐఆర్ డి(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్) లో ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్స్ పై అంతర్జాతీయ శిక్షణ శిభిరాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో టాంజనియా, నైజిరియా, శ్రీలంక, సూడాన్, జింబాబ్వే, ఫిజి, ఈజిప్ట్, ఖజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎన్ఐఆర్ డీ డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి డబ్య్లూ.ఆర్. రెడ్డి, ఎన్ఐఆర్ డీ ప్రతినిధులు శంకర్ ఛటర్జీ, చిన్నాదురై, ఆరుణ జయమణి ల ఆధ్వర్యంలో వచ్చే నెల 27 వరకు శిక్షణ తరగతులు జరగనున్నాయి.

        

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తుందని, గ్రామీణాభివృద్ధి ద్వారానే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి, ఇప్పటికి గ్రామాల్లో పేదరికం అలాగే ఉందన్నారు.గ్రామాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా భారతదేశంలో ఉపాధిహామి, పీఎంజీఎస్ వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్చ్ భారత్ లాంటి పలు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్… ఆ దిశగా తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. గ్రామీణాభివృద్ధికి భవిష్యత్ లో తెలంగాణను రోల్ మోడల్ గా చూపేలా కేసీఆర్ సర్కార్ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆసరా పెన్షన్ లు, విద్యార్థులకు హాస్టలల్లో సన్న బియ్యం భోజనం, కళ్యాణ లక్ష్మీ, స్త్రీ నిధి, దీపం పథకం, స్కిల్ డెవలప్ మెంట్ లాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణం ద్వారా తెలంగాణలోని ప్రతి ఎకరానికి సాగు నీరు ఇచ్చి.. గ్రామాల్లో పేదరికాన్ని పారద్రోలేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. గ్రామస్థాయిలో పని చేస్తున్న వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తెలంగాణలో ఆరంభించామన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంతో నేర్చుకున్న విషయాలు గ్రామీణా పేదరిక నిర్మూలనకు దోహదపడుతాయనే ఆశా భావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail