Browse By

ప్రత్యేక హోదా అంశం : ముసాయిదా సిద్ధం.. త్వరలో ప్రధాని వద్దకు

‘స్విస్ చాలెంజ్’పై అటు హైకోర్టు మొట్టికాయలు, ‘ఓటుకు కోట్లు’పై ఇటు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు..

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా రాయబేరాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై ప్రయత్నాలు వేగిరపరుస్తున్నట్లు కనిపిస్తూనే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాల కోసం కేంద్ర మంత్రులతోనూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోనూ సమాలోచనలు జరిపిస్తున్నారని వినిపిస్తోంది. రెండురోజులుగా చంద్రబాబునాయుడుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన చేస్తున్న సూచనలు పాటిస్తూ కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి చెప్పడం దీనిని బలపరుస్తోంది. మంగళవారంనాడు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడుతో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో భావోద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదో ఒక ప్యాకేజీ ప్రకటించి ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా కేంద్రాన్ని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ప్రత్యేకహోదా కోసం చర్చలు జరుపుతున్నట్లు అనుకూల మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం.
పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, పార్లమెంట్ సాక్షిగా విభజన జరిగిన రోజు కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ముసాయిదాను రూపొందించినట్టు ఆ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. అయితే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందా? లేకా సాంకేతిక అంశాలను సాకుగా చూపి పక్కన పెట్టిందా అన్న అంశం ఉత్కంఠంగా మారింది. ఈ ముసాయిదాపైనే మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఎదురవుతున్న ఆందోళనల దృష్ట్యా ఇందుకు గల సానుకూల, వ్యతిరేక అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail