Browse By

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు

డిసెంబర్‌ 2న స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్‌
నేటి నుంచి ఎన్నికల కోడ్‌ మొదలవుతోంది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేయడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాలో గతంలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండగా, రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్దుబాటులో మరో స్థానం అదనంగా చేకూరింది. దీంతో జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 2న స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కానుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 9 వరకు వారం రోజులపాటు నామినేషన్లు స్వీకరించాలని, డిసెంబర్‌ 27వ తేదీన ఎన్నికలు నిర్వహించి 30న ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిశ్చయించింది. జిల్లాలో ఎన్నికలు జరుగనున్న ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1207 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుని ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు.

వీరిలో అత్యధికులు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే ఉన్నందువల్ల ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్సీలుగా గెలుపొందడం ఖాయమైంది. అధినేత ఆశీస్సు లు పొంది, ఎవరైతే పార్టీ టికెట్‌ సంపాదించుకుం టారో వారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖరారైనట్లేనని భావిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో పోటీ పెరిగింది. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ఒక స్థానంలో టీఆర్‌ఎ్‌సకే చెందిన భానుప్రసాదరావు ఇటీవలి కాలం వరకు ప్రాతిని ధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుం చి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి సార్వత్రిక ఎన్నికల అనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరారు. టీఆర్‌ఎస్‌ లో చేరే సమయంలో తనతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేర్పించినందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ ఆ సందర్భంలోనే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దీంతో భానుప్రసాదరావుకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఖరారైనట్లేనని పార్టీ వర్గా లు భావిస్తున్నాయి. మరో స్థానం కోసం ప్రధానంగా గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ గా ఉన్న నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన చెన్నాడి సుధాకర్‌రావు, మాజీ శాసనసభ్యుడు వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్‌రావు పోటీ పడుతున్నా రు. లక్ష్మణ్‌రావు మొదటి నుంచి పార్టీలో అంకితభావంగల నాయకుడిగా కేసీఆర్‌ మన్ననలు పొందారు. ఆయనకు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని ఇంతకు ముందే అధినేత హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆయనకు టికెట్‌ ఖాయమని చెబుతున్నా మరో ముగ్గురు తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈద శంకర్‌రెడ్డి అందరి నేతల తలలో నాలుకలా మారారు. జిల్లాలో రెడ్డి వర్గీయుల ప్రాధాన్యం తగ్గిపోయిందని ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఆ వర్గీయులు ప్రకటిస్తూ వచ్చారు. రెడ్డి వర్గం తరపున ఈద శంకర్‌ రెడ్డికి ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ పార్టీ అధినేత ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. శంకర్‌ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించినా ఆయనకు నచ్చజెప్పి దాసరి మనోహర్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. పార్టీ ఆదేశాలను శిరసా వహించినందున తనకు ప్రస్తుతం ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని శంకర్‌ రెడ్డి కోరుతున్నారు. రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు ప్రస్తుతం తెరపై ఉండగా నోటిఫికేషన్‌ నాటికి మరెందరు తెరపైకి వస్తారో చూడాల్సిందే.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసినందున జిల్లాలో బుధవార నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోనికి వస్తుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నీతూకుమారిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నియమావళిని ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail