Browse By

రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు

గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది

నగరానికి గోదావరి నీళ్లు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఘనపూర్ వద్ద ట్రయల్ రన్ పనులను అధికారులు పర్యవేక్షించారు. రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చే గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది.
గోదావరి జలాలను యుద్ధప్రాతిపదికన తరలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే గోదావరి జలాలను నగర ప్రజలకు అందించడానికి జలమండలి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌ వరకు 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ ప్రజలకు గోదావరి జలాలను అందించడానికి 2009లో శంకుస్థాపన జరిగింది. అయితే 2012 వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత యుద్ధప్రాతిపదికన జంటనగరాల ప్రజలకు మంచినీటికై గోదావరి జలాలను తరలిస్తున్నారు.

రూ.3వేల375 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా దాటిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా మున్నూరు నుంచి బొమ్మకల్ వరకు, బొమ్మకల్ నుంచి మల్లాపూర్ వరకు, మల్లాపూర్ నుంచి కొండపాక వరకు, కొండపాక నుంచి రంగారెడ్డి జిల్లా ఘన్‌పూర్ వరకు తరలించారు. ఘన్‌పూర్ నుంచి త్వరలోనే నగరంలోని కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్ ప్రాంతంలోని రిజర్వాయర్లకు ఈ నీటిని అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిగా ఎండిపోవడంతో పాటు నగరానికి తరలించే మంజీరా, సింగూర్ జలాలు కూడా పూర్తిగా అడుగంటాయి. కాగా గోదావరి జలాల తరలింపుతో నగరవాసుల దాహార్తిని తీర్చవచ్చని అధికారులు చెబుతున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail